: లోక్‌సభ నడిచే తీరు ఇదేనా?: సభలో కోపోద్రిక్తుడైన ఎల్‌కే అద్వానీ
లోక్‌సభలో ప్రతిపక్షాలు తరుచూ సభను అడ్డుకోవడం పట్ల బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఈ రోజు లోక్‌సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌పై ఆయన మండిపడ్డారు. లోక్‌సభ నడిచే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. స్పీకర్‌గానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగానీ లోక్‌సభను నడపడం లేదని, సభ దాని ఇష్టం వచ్చినట్లు అది నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ రోజు లంచ్ విరామానికి ముందు ప్రతిపక్షాలు గందరోగళం సృష్టించడంతో ఆవేదనా భరితుడైన అద్వానీ ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్వానీని శాంతపరచడానికి అనంతకుమార్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాను ఈ విషయాన్ని పబ్లిగ్గానే చెబుతానని, స్పీకర్‌తోనూ మాట్లాడతానని అన్నారు. మరోవైపు, ప్రతిపక్షాల గందరగోళంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభను నిరవధిక వాయిదా ఎందుకు వేయబోరు? అంటూ అద్వానీ ఆగ్రహంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం లంచ్ విరామ సమయంలోనూ ఆయన ఎవరితోనూ మాట్లాడకపోవడం గమనార్హం. మరోవైపు ఈ రోజు జరిగిన బీజేపీ పార్లమెంటరీ భేటీలోనూ అద్వానీ సభను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.