: ఆసుపత్రిలో ఉన్నప్పుడూ ‘అమ్మ’ జోక్ లు వేసేవారట!
చెన్నై అపోలో ఆసుపత్రి ఐసీయూలో ఉన్నప్పుడు సైతం జయలలిత జోక్స్ వేస్తూ నవ్విస్తుండేవారట. ‘అపోలో’ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి గత ఇరవై సంవత్సరాలుగా జయలలితతో తనకు ఉన్న అనుబంధాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో జయ నర్సులతో బాగా జోక్స్ వేసేవారని, ఆమె ఇంగ్లీషు భాషలో ధారాళంగా మాట్లాడే వారని, ఆమెతో సంభాషణ చాలా జ్ఞానవంతంగా ఉండేదని ఆమె చెప్పారు. లక్షలాది మంది ‘అమ్మ’ అభిమానుల ఆకాంక్షను నెరవేర్చాలన్న ఆరాటంతో ఆమెకు చికిత్స అందించినన్ని రోజులు వైద్యులు తీవ్ర ఒత్తిడితో పనిచేశారని చెప్పారు. అయినప్పటికీ, ఆమెను కోల్పోవాల్సి రావడంతో నర్సులు బిగ్గరగా ఏడ్చేసిన విషయాన్ని ప్రీతారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఫలానా పని చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మితే కనుక నిర్ణయం తీసుకునే విషయంలో జయలలిత వెనుకాడేవారు కాదని.. ఆ పని ఆమె చేసి తీరేవారని చెప్పారు. కోవమ్ నదిని ప్రక్షాళన చేయాలని జయలలిత ఆకాంక్షించారని, సబర్మతీ నదిని ప్రక్షాళన చేసిన విధానం కూడా తమ మధ్య ప్రస్తావనకు వచ్చిందని అన్నారు. తమిళనాట మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని, సామాన్యులకు మరింత వైద్య సదుపాయం అందించాలని జయలలిత కోరుకున్నారని ప్రీతారెడ్డి చెప్పారు.