: ప్రేయసితో కలిసి యువీ పార్టీలో పాల్గొన్న జహీర్ ఖాన్
టీమిండియాకు సుదీర్ఘ కాలం సేవలందించిన స్టార్ పేసర్ జహార్ ఖాన్ తన ప్రేయసితో కలిసి యువరాజ్ సింగ్ వివాహ వేడుకల్లో సందడి చేశాడు. యువరాజ్ సింగ్ తన వివాహ వేడుకలు పది రోజులపాటు జరిగేలా ప్లాన్ చేశాడు. తొలుత సిక్కు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. అంతకు ముందు సంగీత్ నిర్వహించాడు. అనంతరం అత్యంత సన్నిహితులతో గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ రెండింటికి ఐదు రోజులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఢిల్లీలో రిసెప్షన్, ముంబైలో పార్టీ ఇలా పది రోజులపాటు వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పార్టీకి జహీర్ ఖాన్ తన ప్రియురాలు, సినీ నటి సాగరిక ఘాట్గేతో కలిసి హాజరయ్యాడు. యువరాజ్ సింగ్ వివాహానికి కూడా జహీర్ తన ప్రియురాలితో కలిసి హాజరుకావడం విశేషం. 'చక్ దే ఇండియా' సినిమాలో 'ప్రీతి సబర్వాల్' పాత్రలో భారత హాకీ జట్టు కెప్టెన్ గా సాగరిక నటించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో సచిన్, మహ్మద్ కైఫ్ కూడా పాల్గొనడం విశేషం. అలాగే యువీ సహచరులు హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, జహీర్ ఖాన్ లు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. సహచరులను ఆటపట్టించడంలో ముందుండే యువరాజ్, భజ్జీ, ధావన్ లు ఒక చోటచేరడంతో అంతా ఎంజాయ్ చేశారని భజ్జీ ట్వీట్ చేశాడు.