: జయలలిత మృతి నేపథ్యంలో తీవ్ర చర్చనీయాంశమైన క్యాలెండర్ వాక్యాలు!
తమిళ ప్రజల ప్రియతమ నేత జయలలిత మొన్న (ఈ నెల 5న) మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో చెన్నయ్‌లోని ఓ దుకాణం గతంలో ముద్రించిన ఓ క్యాలెండర్‌లోని వాక్యాలు చర్చనీయాంశంగా మారాయి. సదరు దుకాణం ముద్రించిన 2016 క్యాలెండరులో ఒక్కో తేదీపై తాత్వికతతో ముడిపడి ఉండే వాక్యాన్ని ముద్రించారు. ఆ క్యాలెండరులో ఈ డిసెంబర్ 5వ తేదీ వాక్యంగా ‘ఓ గదిలో మరణం.. ఆ పక్కగదిలోనే వారసత్వ గొడవ’ అనే వాక్యం ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, అదే రోజు జయలలిత ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మరణించడం.. ఆ పక్కనే ఉన్న గదిలో పన్నీరు సెల్వం సహా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమిళనాడు కొత్త సీఎం కోసం చర్చలు జరపడంతో అక్కడి ప్రజలంతా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ వాక్యాలు అక్షరాల నిజమయ్యాయని చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ క్యాలెండర్ వాక్యం చక్కర్లు కొడుతోంది. ఈ వాక్యంపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.