: మిస్డ్ కాల్స్, మెసేజ్‌లు ఇస్తున్న అమ్మాయిలు.. ఆపై తియ్యని కబుర్లు చెప్పి డబ్బు దోచుకుంటున్న వైనం
యువకులకు మిస్డ్ కాల్ ఇస్తున్నారు... వాట్సప్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు.. ఆపై వారి వద్ద నుంచి డబ్బు లాగి కనిపించకుండా వెళ్లిపోతున్నారు పలువురు అమ్మాయిలు. ‘హాయ్.. హలో బాగున్నావా? అది కాదు బంగారం.. అయ్యయ్యో అలాగా.. యూ ఆర్ సో స్వీట్’ అంటూ ఎంతో ప్రేమను ఒలకబోస్తూ కమ్మని మాటలు చెబుతున్న పలువురు అమ్మాయిలు యువకులను వలలోకి దింపి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ యువతులు చెబుతున్న మాటలను నమ్మేస్తోన్న యువకులు దారుణంగా మోసపోతున్నారు. వారి చేతిలో మోసపోయేవరకు ఆ అమ్మాయిల అసలు స్వరూపం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఫోన్ ద్వారానే కాదు సామాజిక మాధ్యమాలయిన వాట్సప్, ఫేస్బుక్ ల ద్వారా కూడా వారు యువకులకు గాలం వేస్తున్నారు. మొదట హాయ్ అనే మెసేజ్‌తో ప్రారంభించి, ఎన్నో మాయమాటలు చెప్పి యువకులతో ఆడుకుంటున్నారు. తిరుపతి నగరంతోపాటు చిత్తూరు జిల్లాలో ఇటువంటి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తిరుపతిలోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఓ యువకుడికి ఇటీవల ఓ మిస్డ్ కాల్ వచ్చింది. మొదట ఆ మిస్డ్ కాల్ని ఆ యువకుడు పట్టించుకోలేదు. తరువాతి రోజు అదే నెంబరుతో మరోసారి మిస్డ్‌కాల్ వచ్చింది. తెలిసిన వాళ్లెవరైనా ఉంటారేమోనని తిరిగి కాల్ చేశాడు. అయితే, అతడికి ఓ అందమైన గొంతు వినపడింది. మాట్లాడుతోంది పవనే కదూ? అంటూ ఆ యువతి ఎంతో ప్రేమగా మాట్లాడింది. ఆపై వారిద్దరూ రోజూ చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత కొన్ని రోజులకి తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని కొంత డబ్బులు అవసరమని తనకు ఏడుపు వచ్చేస్తోందని ఆ అమ్మాయి పవన్‌తో చెప్పింది. అమ్మాయి అంతగా అడుగుతుంటే నిజమేనని నమ్మేసిన పవన్ అమాయకంగా రూ.10 వేలు ఆ అమ్మాయికి ఇచ్చేశాడు. ఆ తరువాత ఆ యువతికి ఫోన్ చేస్తే నంబర్ స్విచ్చాఫ్ వచ్చింది. ఇటువంటి అనుభవమే తిరుపతి రాయల్ నగర్‌కు చెందిన మరో యువకుడికి కూడా ఎదురయింది. నాలుగు రోజుల క్రితం ఆ యువకుడికి వాట్సప్‌లో హాయ్.. హలో అంటూ మెసేజ్ వచ్చింది. దీనికి స్పందిస్తూ ఎవరూ? అని ఆ యువకుడు మెసేజ్ పెట్టాడు. స్మార్ట్ ఫోన్ యాప్ అయిన ట్రూ కాలర్ యాప్ ద్వారా అతడి పేరును ముందుగానే తెలుసుకున్న ఆ అమ్మాయి 'అబ్బా.. అన్నీ తెలిసి నేను ఎవరో అడుగుతున్నావా.. నేనెవరో చెప్పుకో చూద్దాం' అని మెసేజ్ పెట్టింది. ఆ యువకుడు అడగ్గా అడగ్గా ఆ యువతి బాలాజీ కాలనీలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటానని చెప్పింది. తన గురించి అంతా చెప్పేశానని ఇక నీ గురించి చెప్పమని అడిగింది. ఆపై అతడిని తన వలలో వేసుకోవడానికి ఎంతో ప్రేమను ఒలకబోస్తూ పలు మెసేజ్‌లు పెట్టింది. అనంతరం రెండు రోజుల క్రితం ఆ యువకుడికి కాల్ చేసిన ఆ యువతి తన ఫ్రెండ్‌ను ఆసుపత్రిలో చేర్పించామని ఆసుపత్రిలో అర్జెంట్‌గా రూ.18 వేలు కట్టమంటున్నారని చెప్పింది. తమ హాస్టల్లో ఉన్న అమ్మాయిల వద్ద ఎవరి దగ్గరా 18 వేల రూపాయలు లేవని, ఆసుపత్రిలో ఉన్న అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు తిరుపతికి రావడానికి ఒకరోజు పడుతుందని చెప్పింది. డబ్బు ఇవ్వమని వాళ్లు రాగానే ఇప్పిస్తానని చెప్పింది. ఆ అమ్మాయి అలా మాట్లాడగానే నిజమేనని నమ్మేసిన ఆ యువకుడు తన వద్ద రూ.12,000 ఉందని, అంతే ఇస్తానని ఆ అమ్మాయిని రమ్మని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి స్కూటీపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి డబ్బు తీసుకెళ్లింది. ఆపై కనిపించకుండా వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో, అమ్మాయిలు కమ్మగా చెప్పే మాటలను నమ్మి వారి మోజులో పడి మోసపోకూడదని పోలీసులు సూచిస్తున్నారు.