: 800 మంది పర్యాటకులను రక్షించేందుకు రంగంలోకి నేవీ నౌకలు బంగారం, కుంభీర్, బిత్రా
బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుపాను కారణంగా అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో చిక్కుకున్న పర్యాటకులను రక్షించేందుకు భారత నావికాదళం రంగంలోకి దిగింది. మూడు దీవుల్లో వీరు చిక్కుకోగా, అందరినీ పోర్ట్ బ్లెయిర్ చేర్చేందుకు నేవీ షిప్ లు బిత్రా, బంగారం, కుంభీర్, ఎల్సీయూ 38 లను అధికారులు వినియోగిస్తున్నారు. భారీ ఎత్తున అలలు తీరాన్ని తాకుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు ఏర్పడి నిదానంగా సాగుతోందని అధికారులు తెలిపారు. టూరిస్టుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని, అవసరమైతే వాయుసేన సహాయం తీసుకుంటామని నేవీ అధికారులు తెలిపారు. కాగా, చిక్కుకుపోయిన వారిలో అత్యధికులు 'హావ్ లాక్' ఐలాండ్ లో ఉన్నారని తెలుస్తోంది. పోర్ట్ బ్లెయిర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉండగా, ఇక్కడికి నాలుగు షిప్ లనూ పంపామని, వాటి సాయంతో అందరినీ కాపాడుతామని అధికారులు తెలిపారు.