: ఒక్కరోజులోనే రూ. 1500 కోట్లు నష్టపోయిన తమిళనాడు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు నిన్న చైన్నైలోని మెరీనా బీచ్ లో కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో, నిన్నంతా చెన్నయ్ నగరం పూర్తిగా బంద్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ వాతావరణం కనిపించింది. జయ మీద గౌరవంతో కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. దీంతో, నిన్న ఒక్క రోజే తమిళనాడుకు రూ. 1500 కోట్ల నష్టం సంభవించింది. ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీలన్నింటికీ తమిళనాడులో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఏడాదికి 3.50 లక్షలకు పైగా కమర్షియల్ వెహికల్స్, 14 లక్షల కార్లు తమిళనాడులో తయారవుతాయి. ప్రతి నిమిషానికి తమిళనాడులో మూడు కార్లు తయారవుతాయి. ఐటీ రంగం విషయానికొస్తే 4 లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తమిళనాడులోని 600 కంపెనీల్లో పని చేస్తున్నారు. ఒక్కరోజే రీటెయిల్ సంస్థలు రూ. 100 నుంచి 200 కోట్ల వరకు నష్టపోయాయని అంచనా. అన్ని రకాల వ్యాపారాలను తీసుకుంటే మొత్తంమీద రూ. 1500 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.