: మమత విమానం ల్యాండింగ్ అంశంలో ఆరుగురు పైలట్ల సస్పెన్షన్


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ కు సంబంధించి ఇటీవల తీవ్ర అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న ఇండిగో విమానం కోల్ కతాలో ల్యాండ్ కావడానికి 15 నిమిషాలు ఆలస్యంగా అనుమతి ఇచ్చారు. నవంబర్ 30న బీహార్ లోని ఓ ర్యాలీలో పాల్గొన్న అనంతరం పాట్నా నుంచి సాయంత్రం 7.30కి మమత తిరుగుపయనమయ్యారు. కోల్ కతాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే... మమత ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ ఆర్డర్ లో 8వ స్థానంలో ఉందని ఏటీసీ నుంచి పైలట్ కు సమాచారం అందింది. అయితే, విమానంలో ఇంధనం తక్కువగా ఉందని... అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాలని పైలట్ కోరారు. అయితే, మరో మూడు విమానాలు కూడా ఇంధనం తక్కవగా ఉందని చెప్పడంతో... మమత విమానం ల్యాండ్ కావడానికి 15 నిమిషాల తర్వాత ఏటీసీ అనుమతి ఇచ్చింది. దీంతో, మమతను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని పార్లమెంటు ఉభయసభల్లో తృణమూల్ సభ్యులు గందరగోళం సృష్టించారు. అయితే, విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ, మరో మూడు విమానాలు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ను కోరడంతోనే... ఇండిగో విమానంకు ల్యాండింగ్ అనుమతి రావడానికి కొంచెం ఆలస్యమయిందని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్... ఆరుగురు పైలట్లపై సస్పెన్షన్ విధించింది.

  • Loading...

More Telugu News