: ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోసే వరకు విశ్రమించం: పాక్ తాలిబాన్లు
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దాడులకు స్వస్తి చెప్పాలంటూ పాకిస్తాన్ సర్కారు చేసిన విన్నపాలను తాలిబాన్లు పెడచెవిన పెడుతున్నారు. పైగా, పాక్ లో ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోయడమే తమ లక్ష్యమని కూడా అంటున్నారు. ఈ మేరకు తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ హకీముల్లా మెహ్ సూద్ మీడియాకు ఓ లేఖ రాశారు. అందులో 'పాక్ లో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించడమే మా లక్ష్యం' అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను ఆటంకపరిచే కార్యక్రమాలు (దాడులు) ఆపేదిలేదని కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు.
మే 11న జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు పాకిస్తాన్ సిద్ధమవుతున్న తరుణంలో నిషేధిత తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఉగ్రవాదులు ప్రముఖ రాజకీయ నాయకుల ప్రాణాలకు గురిపెట్టారు. ప్రభుత్వం తమను శాంతి చర్చలకు పిలవడం పట్ల మెహ్ సూద్ వ్యాఖ్యానిస్తూ, పాక్ సర్కారు మెడలు వంచడంలో తాము సఫలమయ్యామన్నారు.