: ఎంత అభిమానం, నిరాడంబరత..!.. జయలలిత కోసం ప్రణబ్ ముఖర్జీ ఇలా వచ్చారు!
అది విమానంలోని బిజినెస్ క్లాస్ కుర్చీ కాదు. కనీసం సాధారణ తరగతిలోని చైర్ కూడా కాదు. దానికి హ్యాండ్ రెస్ట్ లేదు. అది నలుగురు కూర్చునే సోఫా వంటిది. దానిపైనే కూర్చుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణం చేశారు. ఎక్కడికో తెలుసా? తానెంతో అభిమానించే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు. ఆమె కడసారి చూపు కోసం ఆయన భారత వాయుసేనకు చెందిన ఓ మామూలు హెలికాప్టర్ లో చెన్నైలోని మెరీనా బీచ్ కి విచ్చేయగా, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తొలుత బయలుదేరిన విమానంలో సాంకేతికలోపం ఏర్పడి తిరిగి వెనక్కు వెళ్లగా, రాష్ట్రపతి ప్రయాణం రద్దయిందన్న వార్తలు వచ్చాయి. కానీ, జయలలితను ఆఖరి సారి చూడాలన్న ప్రణబ్ కోరిక, ఆయన్ను ఢిల్లీలో వుండనీయలేదు. అందుబాటులో ఉన్న మరో విమానంలో ఆయన చెన్నై వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. ఇక అక్కడి నుంచి మేరీనాకు రోడ్డు మార్గాన వెళితే, జయలలిత పార్థివదేహాన్ని దర్శించుకునే అవకాశాలు ఉండవని తెలిసిన వేళ, ఇదిగో ఇలా సాధారణ జవానులా ఎంఐ-17 రవాణా హెలికాప్టర్ లో కూర్చుని 80 ఏళ్ల రాష్ట్రపతి మెరీనా బీచ్ కి చేరుకున్నారు.