: జయలలిత ప్రసంగాన్ని వినడం కోసం సాక్షాత్తు ఇందిరాగాంధీనే ఆరోజు సభకు వచ్చారు!: కురియన్
జయలలిత మరణం పట్ల పార్లమెంటు ఉభయసభలు ఈ ఉదయం నివాళులు అర్పించాయి. అనంతరం వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ మాట్లాడుతూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1984లో రాజ్యసభలో సభ్యురాలిగా ఉన్న జయలలిత తొలిసారి ప్రసంగించారని... ఆమె ప్రసంగాన్ని వినడం కోసం సాక్షాత్తు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజ్యసభకు హాజరయ్యారని చెప్పారు. తాను ఆ సమయంలో లోక్ సభ సభ్యుడిగా ఉన్నట్టు తెలిపారు. జయ ప్రసంగిస్తున్న సమయంలో రాజ్యసభ గ్యాలరీ మొత్తం కిక్కిరిసిపోయిందని... ఆమె ప్రసంగానికి అందరూ ముగ్ధులయ్యారని... ఆ రోజు అదే పెద్ద వార్త అయిందని కురియన్ తెలిపారు. సినీ నేపథ్యం ఉన్న జయలలిత అంత అద్భుతంగా మాట్లాడగలరని ఎవరూ ఊహించలేకపోయారని చెప్పారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకురాలు జయ అని కొనియాడారు. మహిళల సాధికారత, పేదల అభ్యున్నతి కోసం ఆమె నిరంతరం కృషి చేశారని చెప్పారు.