: జయలలిత, నేను ఒకే స్కూల్లో చదివాం.. ఆమె నాకు సీనియర్: నటుడు సుమన్
అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల నటుడు సుమన్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆసుపత్రిలో చికిత్స పొందిన జయలలిత త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తుందని తాము అనుకున్నామని, కానీ ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. జయలలిత, తాను ఒకే స్కూల్లో చదువుకున్నట్లు తెలిపారు. చెన్నయ్‌లోని చర్చ్ పార్క్ స్కూల్లో తాను మూడో తరగతి చదువుతున్నపుడు జయలలిత తన సీనియర్ అని ఆయన తెలిపారు. ఆమె షూటింగ్లకు వెళ్లడం తనకు గుర్తుందని సుమన్ వ్యాఖ్యానించారు. జయలలిత నటిగా కంటే మంచి డాన్సర్గానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఆమె సొంతంగా ఎదిగి రాజకీయాల్లో అద్భుతంగా రాణించారని చెప్పారు. ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారని కొనియాడారు. అమ్మ క్యాంటిన్‌లు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, పేదల హృదయాల్లో ఆమె ఎప్పటికీ నిలిచే ఉంటారని చెప్పారు.