: తమిళనాడు మహిళా ముఖ్యమంత్రులు ఇద్దరూ... ఒకే రీతిలో చనిపోయారు!
తమిళనాడు రాష్ట్రాన్ని ఇద్దరు మహిళలు జయలలిత, జానకి రామచంద్రన్ లు పరిపాలించారు. జయలలిత ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగా... జానకి కేవలం ఒక్కసారి మాత్రమే ఈ పదవిని అలంకరించారు. 1988 జనవరి 7వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు... అంటే 23 రోజులు ముఖ్యమంత్రిగా జానకి వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సతీమణే జానకి. అయితే, ఈ ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు ఒకే రీతిలో చనిపోవడం గమనార్హం. వీరిద్దరూ కార్డియాక్ అరెస్ట్ తోనే ప్రాణాలు వదిలారు. తొలుత జయలలిత గుండెపోటుకు గురైందని వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారంటూ ఆ తర్వాత వైద్యులు స్పష్టం చేశారు. అనంతరం, వైద్యులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ జయను బతికించలేకపోయారు. జానకి రామచంద్రన్ కూడా ఇదే రీతిలో తుదిశ్వాస విడిచారు. 1996 మే 19న ఆమె కూడా కార్డియాక్ అరెస్ట్ కు గురై, మృతి చెందారు.