: అనర్హత వేటు ఉన్నా, సీఎంగా ప్రమాణస్వీకారం... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జయ


దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితమంతా వివాదాలమయమే. పురుషాధిక్యత అధికంగా ఉండే తమిళ రాజకీయాల్లోకి... ఆమె ఎంట్రీనే చాలా గొప్ప. ఆ తర్వాత, కాకలుతీరిన తమిళ పురుష రాజకీయ నేతలంతా తన ముందు మోకరిల్లాల్సిన పరిస్థితిని ఆమె తీసుకువచ్చారు. ఆమె కళ్లలో కళ్లు పెట్టి చూసే, దుస్సాహసం కూడా చేయాలేకపోయారంటే అది అతిశయోక్తి కాదు. తాను తీసుకున్నదే నిర్ణయం అనే విధంగా ఆమె వ్యవహరించేవారు. ఈ క్రమంలో, 2000 అక్టోబర్ లో జయను ఓ కేసులో న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. 1992లో జయ, ఆమె స్నేహితురాలు శశికళలు భాగస్వాములుగా ఉన్న జయా పబ్లికేషన్స్, శశి ఎంటర్ ప్రైజెస్ కోసం అక్రమంగా మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించారనే ఆరోపణలతో ఆ కేసు నమోదైంది. ఆ కేసును అప్పటి కరుణానిధి ప్రభుత్వం పెట్టింది. జయను కోర్టు దోషిగా ప్రకటించడంతో, ఆ తర్వాత 2001లో జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. అయితే, ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించింది. తనపై అనర్హత వేటు ఉన్నా లెక్కచేయని జయ... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ విషయం దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. అంతేకాదు, అప్పటి తమిళనాడు గవర్నర్ ఫాతిమాబీబీ రాజీనామాకు కూడా కారణమైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, జయ ప్రమాణస్వీకారం చెల్లదని తేల్చి చెప్పింది. దీంతో, ఆమె సీఎం బాధ్యతలను తన నమ్మకస్తుడు పన్నీర్ సెల్వంకు అప్పగించారు.

  • Loading...

More Telugu News