: యూరోపై ఇటలీ సంక్షోభం దెబ్బ... 20 ఏళ్ల కనిష్ఠానికి జారిపోయిన కరెన్సీ
రాజ్యాంగ సవరణలు కోరుతూ రెఫరెండం నిర్వహించి, అపజయం పాలైన ఇటలీ ప్రధాని మాటియో రెంజీ రాజీనామా చేయగా, ఆ ప్రభావంతో యూరో విలువ డాలర్ తో పోలిస్తే 20 ఏళ్ల కనిష్ఠానికి దిగజారింది. రెంజీ రాజీనామా వార్త ప్రకటించగానే ప్రారంభమైన పతనంలో భాగంగా డాలర్ తో మారకపు విలువ 1.05ను తాకింది. ఇప్పటికే యూరో జోన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో అనిశ్చితి మధ్య పడుతూ లేస్తూ నడుస్తున్న యూరో విలువ, మరో కీలక భాగస్వామ్య దేశం ఇటలీలో నెలకొన్న అనిశ్చితితో మరింతగా కుదేలైంది. ఇక యూరోజోన్ ముక్కలయ్యే స్థితి ఏర్పడనుందని ఆర్థిక వేత్తలు చేస్తున్న విశ్లేషణలు సైతం ఫారెక్స్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను నాశనం చేశాయని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ఇటలీలో సంస్కరణలకు బహిరంగ మద్దతిచ్చిన అమెరికా, రెఫరెండానికి వ్యతిరేకంగా ఓట్లు వస్తే ఇటలీలో పెట్టుబడులు నిలిపివేస్తామని బెదిరించినప్పటికీ, ప్రజలు వినకపోవడం గమనార్హం.