: యువతీ యువకులకు ఇదో శిక్ష... ఏపీ, తెలంగాణల్లో వేల పెళ్లిళ్లు రద్దు
నోట్ల రద్దు దాదాపు లక్ష మంది యువతీ యువకుల భవిష్యత్ కలలను పాడు చేసింది. నోట్ల రద్దు తరువాత తెలుగు రాష్ట్రాల్లో వేల వివాహాలు రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగింది. నోట్ల లభ్యత కరవు కావడం, వివాహం కోసం వివిధ చెల్లింపులు జరిపే పరిస్థితి లేకపోవడంతోనే పెళ్లిళ్లు రద్దయ్యాయని, ఈ సీజనులో అత్యంత శుభ ముహూర్తాలు ఉన్న రోజుల్లోనూ పదుల సంఖ్యలోనే వివాహాలు జరిగాయని పండితులు చెబుతున్నారు. వాస్తవానికి నేడు హైదరాబాద్ లో 20 వేలకు పైగా పెళ్లిళ్లు జరగాల్సి వుండగా, వీటిల్లో చాలా పెళ్లిళ్లు కరెన్సీ కొరతతో నిలిచిపోయినట్టు తెలుస్తోంది. వివాహాలు తలపెట్టిన వారు శుభలేఖలు తీసుకు వెళితే, రూ. 2.5 లక్షల విత్ డ్రాకు అవకాశమున్నా, ఏ బ్యాంకు కూడా ఖాతాదారులకు రెండున్నర లక్షల విత్ డ్రాకు సహకరించలేదు. ఆధార్, పాన్ కార్డులతో పాటు, వివిధ చెల్లింపుల నిమిత్తం ఇచ్చిన అడ్వాన్సుల రిసిప్ట్ లను తీసుకువెళ్లినప్పటికీ, బ్యాంకు అధికారులు, తమ వద్ద డబ్బు లేదని చెప్పి మొండి చెయ్యి చూపిన ఘటనలే అధికం. దీంతో చేతి నిండా చాలినంత కరెన్సీ లేకనే ఈ వివాహాలు నిలిచాయని తెలుస్తోంది. "బ్యాంకుకు అన్ని కాగితాలూ సమర్పించినా, రూ. 1.2 లక్షలకు మించి ఇవ్వలేనన్నారు. ఆ డబ్బుతో పెళ్లి చేసే అవకాశం లేదు. దీంతో నా కుమార్తె వివాహాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది" అని మాదాపూర్ కు చెందిన చంద్రిక అనే మహిళ వాపోయింది. అన్నీ సరిగ్గా జరిగివుంటే, చంద్రిక కుమార్తె వివాహం నేడు వైభవంగా జరిగివుండేది. తాను పెళ్లి కోసం ఇల్లమ్మి మరీ బ్యాంకులో డబ్బు వేసుకున్నానని, కానీ ఆ డబ్బు తన అవసరానికి ఉపయోగపడలేదని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో తాము చేయగలిగింది కూడా ఏమీలేదని బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకే తాము పనిచేస్తున్నామని, ఆ నిబంధనలను అతిక్రమించలేమని చెప్పారు. ఇక ఈ కష్టాలు తొలగిపోవాలని, తదుపరి ముహూర్తానికి తమ వివాహం అవుతుందని యువతీ యువకులు భావిస్తున్నారు.