: వంగవీటి రాధాకృష్ణతో రామ్ గోపాల్ వర్మ భేటీ.. ఎమ్మెల్యే కొడాలి నాని సైతం హాజరు
ఈ రోజు సాయంత్రం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'వంగవీటి' సినిమా ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 23వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమా వాస్తవాలకు విరుద్ధంగా ఉందంటూ వంగవీటి మోహనరంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేయడం, రంగారాధ మిత్రమండలి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ రోజు రాధాకృష్ణతో భేటీ అయ్యారు. వంగవీటి సినిమా వివాదంపై ఇరువురు చర్చిస్తున్నారు. వంగవీటి కుటుంబానికి చెందిన విజయవాడలోని హెల్ప్ ఆసుపత్రిలో ఈ భేటీ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించిన పలు అంశాలను గురించి రాధాకృష్ణకు వర్మ వివరిస్తున్నారు. ఈ భేటీలో వారితో పాటు ఎమ్మెల్యే కొడాలి నాని, పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. భారీ ఎత్తున అభిమానులు కూడా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు.