: మీ పుకార్లతో నన్ను కెప్టెన్ ను చేయవద్దు: ఇంగ్లండ్ ఆటగాడు రూట్
అలిస్టర్ కుక్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు పరాజయాలపాలవ్వడంతో అతనిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, అద్భుతంగా రాణిస్తున్న జో రూట్ కు పగ్గాలు అప్పగించనున్నారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై జో రూట్ స్పందిస్తూ, ఇంగ్లండ్ జట్టుకు కుక్ గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. కుక్ తమ సారథిగా ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదని రూట్ చెప్పాడు. ఇంగ్లండ్ జట్టులో కుక్ కు ప్రత్యేకస్థానం ఉందన్న సంగతి మరువొద్దని సూచించాడు. జట్టు కెప్టెన్ గా రాణించే అన్ని అర్హతలు అతనికి ఒక్కడికే ఉన్నాయన్న సంగతి తెలిసిందేనని అన్నాడు. కుక్ సారథ్యంలో ఆడడాన్ని తాను ఆస్వాదిస్తానని తెలిపాడు. తనను బలవంతంగా కెప్టెన్ ను చేయడం వల్ల కుక్ కు వచ్చిన నష్టమేమీ లేదని, అతను మరింత స్వేచ్ఛగా ఆడే వీలు కల్పించిన వారవుతారని తెలిపాడు. ఇంగ్లండ్ జట్టుకు తాను కెప్టెన్ కావడానికి చాలా సమయం ఉందన్న విషయం గుర్తించాలని సూచించాడు. నిజాయతీగా చెప్పాలంటే కుక్ గొప్ప నాయకుడని, అతని ప్రతిభను తక్కువ చేసి చూపొద్దని తెలిపాడు.