: నగదురహిత లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇస్తాం: చంద్రబాబు
అనంతపురం జిల్లాలో పర్యటిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిరలో చంద్రన్న పసుపు కుంకుమ ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇప్పిస్తామని డ్వాక్రా మహిళలకు చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన నగదును తెప్పిస్తామని అన్నారు. నగదురహిత లావాదేవీలకు ఏపీ నాంది పలకాలని చంద్రబాబు సూచించారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరూ నగదురహిత లావాదేవీలకు అలవాటుపడాలని సూచించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవడానికి మనలో అందుకు కావాల్సిన క్రమశిక్షణ ఉండాలని అన్నారు. ఒక లక్షా 30 కోట్ల మందికి రూ.385 కోట్లు ఖర్చుపెట్టి ఆరు రకాల సరుకులతో సంక్రాంతి కానుకనిస్తామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయి 2029 కి ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందని, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు.