: 'భారత ఆర్మీని మట్టికరిపిద్దాం'... బుర్హాన్-హఫీజ్ మాట్లాడుకున్న సంచలన ఆడియో టేప్ వెలుగులోకి!


ఈ ఏడాది జులై 8న భారత సైన్యం చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తో ఫోన్లో మాట్లాడిన ఓ టేప్ తాజాగా బయటపడింది. తన ప్రాణాలు పోవడానికి కొన్ని గంటల ముందే హ‌ఫీజ్ స‌యీద్‌తో బుర్హాన్ వ‌నీ మాట్లాడాడు. అందులో బుర్హాన్ వ‌నీ మాట్లాడుతూ.. ఇప్పటికే భార‌త సైన్యంపై తాము పై చేయి సాధించామ‌ని అన్నాడు. భ‌విష్య‌త్తులో కూడా త‌మ‌ ఆధిపత్యం కొనసాగాలని, దానికి హ‌ఫీజ్ స‌యీద్ నుంచి ఆశీర్వాదాలు, ఆయుధాలు కావాలని కోరాడు. అక్క‌డ ఉన్న ల‌ష్కరే తోయిబా అనుచ‌రుల‌ సహకారం కూడా కావాలని కోరాడు. భార‌త‌ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ టేపులు నిజమైనవేనని చెప్పిన‌ట్లు ఓ జాతీయ ప‌త్రిక పేర్కొంది. అందులో బుర్హాన్ వ‌నీ మొద‌ట 'సలామ్ వాలేకుం.. ఎలా ఉన్నారు?' అని హఫీజ్ ని అడిగాడు. దానికి హ‌ఫీజ్‌ 'ఆ.. బాగున్నా. ఎవరు? బుర్హానేనా?' అని ప్ర‌శ్నించాడు. బుర్హాన్ 'అవును. నేను బుర్హాన్ నే. మీరు బాగున్నారు కదా!' అని ప్ర‌శ్నించాడు. దేవుడి దయ వ‌ల్ల బాగున్నాన‌ని హఫీజ్ చెప్పాడు. హ‌ఫీజ్ తో ఎన్నో ఏళ్లుగా మాట్లాడాలని ఎదురు చూస్తున్నాన‌ని, హ‌ఫీజ్‌ లాంటి పెద్దల సహకారం ఉంటే ఏదైనా చెయ్యగలమ‌ని బుర్హాన్ వ‌నీ అన్నాడు. దేవుడు క‌రుణ కురిపించ‌డంతో ఆయ‌న‌తో మాట్లాడగలుగుతున్నానని వ్యాఖ్యానించాడు. కశ్మీర్ లోని లష్కరే సభ్యులు స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని, హ‌ఫీజ్‌ నుంచి సహకారం అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నాడు. త‌మ‌ శత్రువు ఇండియన్ ఆర్మీ మీద తాము దాదాపు పట్టు సాధించామ‌ని, భ‌విష్య‌త్తులో మరిన్ని దాడులు చేస్తామ‌ని అన్నాడు. ల‌ష్క‌రే తోయిబా సహకరిస్తే భార‌త‌ ఆర్మీని కశ్మీర్ నుంచి పూర్తిగా వెళ్లగొట్టగలమ‌ని చెప్పాడు. అందుకు హ‌ఫీజ్ స్పందిస్తూ ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాన‌ని భార‌త ఆర్మీతో పోరాటంలో విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నాడు. బుర్హాన్ వ‌నీకి సంబంధించిన ప్రతి సమాచారం త‌మ‌కు అందుతూనే ఉందని, కశ్మీర్లో ఎంతో సాహ‌సంతో పనిచేస్తున్నావని హఫీజ్ అన్నాడు. త‌మ వాళ్లతో టచ్ లో ఉండాల‌ని చెప్పాడు.

  • Loading...

More Telugu News