: తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు... ఎన్నిచ్చారు?: కేసీఆర్ పై టీడీపీ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఊదరగొట్టిన కేసీఆర్... ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలను ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కేజీ టూ పీజీ విద్య అటకెక్కిందని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా... ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల సాధనకై వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9న 'విద్యార్థుల పోరుబాట' పేరుతో బహిరంగసభను నిర్వహించనున్నట్టు తెలిపారు.