: కన్యాకుమారిలో ఉన్నా వదలం!: జమ్మూకాశ్మీర్ పోలీసులను హెచ్చరించిన బుర్హాన్ వనీ వారసుడు!


జమ్మూకాశ్మీర్ లో సుమారు ఐదు నెలల క్రితం హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం విదితమే. ఆ తర్వాత సంబంధిత ‘ఉగ్ర’ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా, జమ్మూకాశ్మీర్ పోలీసులను హెచ్చరిస్తూ బుర్హాన్ వనీ వారసుడు జకీర్ మూసా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ముజాహిదీన్ లకు, పోలీసులకు మధ్య జరుగుతున్న పోరాటంలోకి తమ కుటుంబసభ్యులను ఎందుకు లాగుతున్నారని ఆ వీడియోలో ప్రశ్నించాడు. అదే పద్ధతిలో పోలీసులు ఉంటే, తామూ అదే విధంగా చేయాల్సి వస్తుందని హెచ్చరించాడు. జమ్మూకాశ్మీర్ లేదా బయట ప్రాంతాల్లో నివసించే తమ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని పోలీసులు అనుకుంటున్నారేమో, ఆ కుటుంబాలు కన్యాకుమారిలో ఉన్నా సరే, వారిపై దాడి చేసే సత్తా తమకు ఉందంటూ జకీర్ మూసా హెచ్చరించాడు. ఇదిలా ఉండగా ఈ వీడియోపై పోలీస్ అధికారులు మాట్లాడుతూ, బుర్హాన్ వనీ కుటుంబాన్ని తాము విచారించిన నేపథ్యంలోనే ఈ వీడియోను విడుదల చేసినట్లు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితం చండీగఢ్ లో జకీర్ మూసా ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. బుర్హాన్ వనీతో కలిసి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ వచ్చాడు.

  • Loading...

More Telugu News