: రాజ్యసభకు వచ్చిన ప్రధాని మోదీ.. విపక్షాల నినాదాలతో గందరగోళం
పెద్దనోట్ల రద్దు అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. ఈ రోజు రాజ్యసభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ రోజు కూడా రాజ్యసభలో సీన్ రిపీట్ అయింది. నోట్లరద్దు అంశంపై చర్చించాలని, మోదీ సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభలో ప్రధాని మోదీ మాట్లాడాలని జేడీయూ సభ్యుడు శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుపై సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని అధికార పక్షనేతలు చెప్పారు. అయినప్పటికీ సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. మరోవైపు లోక్‌సభలోనూ పెద్దనోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుపడుతూ నినాదాలు చేయడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.