: ‘ఒకటో తారీఖు’ భయం వద్దు.. నగదుకొరత ఇబ్బందులకు నగదురహిత లావాదేవీలతో ఇలా చెక్‌ పెడదాం!


అమెరికా, సింగపూర్ లాంటి దేశాల్లో 50 శాతానికి మించి లావాదేవీలు నగదురహితంగానే జరుగుతాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మనదేశంలోనూ అటువంటి లావాదేవీలే జరిగేలా ప్రజలను ప్రోత్సహించాలని చూస్తోంది. తద్వారా అవినీతిని మరింత తగ్గించవచ్చని, నల్లధనరహిత భారత్ కల సాకారం కావాలని ఎంతో కృషి చేస్తోంది. దీని కోసం ప్ర‌జ‌ల సాయం కోరుతోంది. దేశాన్ని ప‌ట్టి పీడిస్తోన్న న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల‌తో దేశ ఆర్థిక ప‌రిస్థితి ఛిన్నాభిన్నం అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణయం ప్ర‌జ‌ల‌ను కొన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తోన్న విష‌యం నిజ‌మే. ఓ గొప్ప మార్పుకోసం క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రులు కోరుతున్నారు. న‌గ‌దు కొరత నేప‌థ్యంలో ఈ రోజు వేత‌న జీవుల అకౌంట్లో జీతాలు ప‌డేరోజు కావ‌డంతో ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆందోళ‌న నెల‌కొంది. ఈ ప‌రిస్థితుల్లో న‌గ‌దుర‌హిత లావాదేవీలను గురించి తెలుసుకొని ఆ మార్గంలో వెళితే ఎటువంటి బాధ‌లు ఉండ‌వు. దీన్ని సద్వినియోగం చేసుకుని సమస్యల‌కు చెక్ పెడ‌దాం. ఇంటి అద్దె, కేబుల్‌బిల్‌, కరెంట్ బిల్లుల‌తో పాటు కిరాణా సరకులు, పిల్లల స్కూలు ఫీజులు వంటి వాటిలో చాలా వాటికి న‌గ‌దుర‌హిత లావాదేవీల ద్వారా బిల్లులు చెల్లించ‌వ‌చ్చు. కిరాణా స‌రుకులు, స్కూలు ఫీజులు, క‌రెంట్ బిల్లుల వంటివి ఆన్‌లైన్ ద్వారా క‌ట్టేవెసులుబాటు గురించి ఇప్ప‌టికే ఎంతో మందికి తెలిసిన విష‌య‌మే. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు కిరాణా దుకాణాలు ఇప్ప‌టికే స్వైపింగ్ మిష‌న్‌ల‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక స్కూలు ఫీజులు కూడా ఇటువంటి విధానం ద్వారానే తీసుకుంటున్నారు. క‌రెంటు ఫీజుల‌ను మీ సేవ లేదా ఆన్‌లైన్, మొబైల్ లావాదేవీల ద్వారా చెల్లించుకోవ‌చ్చు. మీ డెబిట్ కార్డుని వినియోగించుకొని ఈ సదుపాయాల్ని ఉపయోగించుకోండి. ఇక‌ అందుబాటులో ఉన్న నగదుతో ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల‌ను సర్దుబాటు చేసుకొంటూ పొదుపు మంత్రాన్నీ అలవర్చుకుంటే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌నం మహారాష్ట్ర థానే జిల్లా ముర్బాద్‌ తాలూకాలోని మూరుమూల ధసాయ్ గ్రామం గురించి చెప్పుకునే ఆవ‌శ్య‌క‌త ఎంత‌యినా ఉంది. దేశంలోనే తొలి నగదు రహిత లావాదేవీలు జ‌రిపే గ్రామంగా నిలిచి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. ఆ గ్రామంలో ఇప్పుడు న‌గ‌దు కొర‌త అన్న బాధ‌లే లేవు. ఆ గ్రామంలో ఒక్కరోజు వ్యాపార లావాదేవీలు మొత్తం రూ.10 లక్షలకు పైగానే ఉంటున్నాయి. క‌రెంటు బిల్లుల చెల్లింపుల కోసం www.tssouthernpower.com లో పే యువర్‌ బిల్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మీట క్లిక్ చేయండి. అందులో మీకు బిల్‌ డెస్క్‌, పేటీఎం, ట్రాన్జాక్షన్‌ అస్యూర్డ్‌ ఐకాన్‌లు కనబడతాయి. ఇందులో మీకు అనువైనది ఎంపిక చేసుకుని డెబిట్‌, క్రెడిట్‌, ఈవాలెట్‌ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. ఇక దూర ప్రయాణాలకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ సదుపాయాన్ని ఆర్టీసీతో పాటు మిగ‌తా అన్ని ప్రైవేటు సంస్థలు కల్పిస్తున్నాయి. ఇక‌ ఇంటి అద్దెను యజమాని ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయ‌డం లేదా చెక్కు ద్వారా చెల్లించే ప‌ద్ధ‌తిని అవ‌లంబించండి. డిసెంబ‌రు 30 వ‌ర‌కు క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌ల‌కు ఛార్జీలు కూడా లేవు. న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌రిపేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవసరం. కంప్యూటర్‌ తెరపై అనూహ్యంగా కనిపించే పాప్‌అప్‌ బటన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ‌కూడ‌ద‌ని సైబ‌ర్ పోలీసులు చెబుతున్నారు. మీ ఏటీఎం పిన్‌, సీవీవీ నెంబ‌రు, ఎక్స్‌పైరీ డేట్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డులు, ఓటీపీ నెంబ‌రు వంటివి ఇత‌రుల‌కు చెప్పకూడ‌దు. ఈ మెయిల్, సోష‌ల్ మీడియా ద్వారా వ‌చ్చే లింకుల‌ను న‌మ్మ‌కూడ‌దు. వాటి ద్వారా లావా దేవీలు జ‌రుపుకోవ‌చ్చ‌ని అనుకోకండి. సైబ‌ర్ నేర‌గాళ్లు వాటిని పంపిచే అవ‌కాశం ఉంది. భారతీయ రిజర్వు బ్యాంకుతో కలిసి ప్రజల కష్టాలను తీర్చడానికి ఇప్పటికే మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి నోట్ల ముద్రణాలయాలు. త్వరలోనే ప్రజలకి అవసరమైన నగదు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, నగదురహిత లావాదేవీలతో చిల్లర కొరతతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అరికట్టవచ్చు.

  • Loading...

More Telugu News