: అమెరికా వలస నిబంధనల్లో కీలక మార్పులు.. వీసా టెర్మినేట్ అయినా 60 రోజులు అక్కడే ఉండొచ్చు
అమెరికా వలస నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా మార్పుల ప్రకారం హెచ్-1బీ వీసా టెర్మినేట్ అయినా రెండు నెలలపాటు అక్కడే కొనసాగేలా నిబంధనలను సవరించింది. తాజా మార్పులు ఇప్పటికే హెచ్-1బీ వీసా పొందిన వారికి సానుకూలంగా మారాయి. గతనెల 18న యూఎస్‌సీఐఎస్ ప్రచురించిన అంతిమ నిబంధన ప్రకారం వచ్చే ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి రానుంది. అమెరికాకు వచ్చి పనిచేసే వృత్తి నిపుణుల హెచ్-1బీ వీసా ఏ కారణంగానైనా టెర్మినేట్ అయితే భయపడాల్సిన పనిలేదు. టెర్మినేట్ అయినవారు 60 రోజులపాటు దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు. ఈ కీలకమార్పు వల్ల ఉద్యోగ నియామకాల ధ్రువీకరణ విషయంలో ఇచ్చిన వెసులుబాటు వల్ల హెచ్-1బీ వీసా కలిగిన వారి జీవిత భాగస్వాములకు ఇబ్బందులు తొలగినట్టేనని భావిస్తున్నారు. కొత్త నిబంధన వల్ల వీసా గడువు పొడిగింపునకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపులు తప్పినట్టే.