: బీ రెడీ!.. రేపటి నుంచి మళ్లీ 'టోల్' తీస్తారు
నోట్ల రద్దు పుణ్యమా అని వాహనదారులకు గత 20 రోజులుగా టోల్ ట్యాక్స్ కట్టే బాధ తప్పింది. టోల్ బాధ లేకుండా రయ్‌మంటూ దూసుకుపోయిన వాహనదారుల లగ్జరీకి రేపటి నుంచి తెరపడనుంది. 2వ తేదీ అర్ధరాత్రి దాటాక మళ్లీ వాహనదారులు యథావిధిగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. జాతీయ రహదారులపై ఎప్పటిలాగే టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత చిల్లర సమస్యలు తలెత్తడంతో టోల్ గేట్ల వద్ద గొడవలు ప్రారంభమయ్యాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. దీంతో స్పందించిన ప్రభుత్వం నవంబరు 11వ తేదీ అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. తర్వాత దానిని పలుమార్లు పొడిగించారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన గడువు ముగిసిపోవడం, టోల్ గేట్ నిర్వాహకులు తమ వద్ద తగిన ఏర్పాట్లు చేసుకున్నట్టు ధ్రువీకరించిన ప్రభుత్వం రేపటి నుంచి టోల్ ట్యాక్స్ కట్టాల్సిందేనని పేర్కొంది. చిల్లర సంక్షోభం మరోమారు తలెత్తకుండా ఉండేందుకు ఈనెల 15 వరకు రద్దయిన పాత రూ.500 నోట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే టోల్ కౌంటర్ల వద్ద ఎస్బీఐ కార్డు స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా కార్డు ద్వారా కూడా టోల్ చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఇక చిల్లర ఇబ్బందులు తప్పినట్టేనని ప్రభుత్వం భావిస్తోంది.