: విశాఖ మన్యాన్ని వణికిస్తున్న చలిపులి!
విశాఖ మన్యాన్ని మంచుకమ్మేసింది. విశాఖపట్టణం జిల్లాలోని అటవీ ప్రాంతం మొత్తం చలిపులికి వణుకుతోంది. ఉత్తరాదినుంచి వీస్తున్న చల్లగాలులకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖ మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డిసెంబర్ చివరి వారంలో ఈ ప్రాంతాన్ని అలముకునే పొగమంచు ఇప్పటికే దట్టంగా కమ్మేసింది. దట్టంగా ఆవరించిన పొగమంచు కారణంగా చింతపల్లి, పాడేరు, అరకు పరిసర ప్రాంతాల్లో చిమ్మచీకట్లు అలముకున్నాయి. దీనికి తోడు లంబసింగి, మోదకొండమ్మ అమ్మవారి పాదాలు, చింతపల్లి, అరకుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగి, మోదకొండమ్మవారి పాదాల వద్ద 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, పాడేరు, చింతపల్లి, అరకుల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో మన్యం వాసులు అడుగు బయటపెట్టాలంటే బెంబేలెత్తిపోతున్నారు.