: రాజీవ్‌శర్మ పనితీరు రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది!: వీడ్కోలు సభలో సీఎం కేసీఆర్
కొత్త రాష్ట్రంలో ఉన్న కష్టాలను ఎదుర్కుంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఎంతో నేర్పుగా పనిచేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు రాజీవ్ శర్మ పదవీ విరమణ పొందుతుండడంతో సచివాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్‌తో పాటు రాష్ట్రమంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాజీవ్‌శర్మ పనితీరు రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. రాజీవ్‌శర్మకు వీడ్కోలు పలకడానికి రాష్ట్ర మంత్రి వర్గమంతా ఇక్కడకు వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఆయనను ఆశీర్వదించడానికి యాదాద్రి నుంచి పూజారులు కూడా వచ్చారని చెప్పారు. ఆయన ఎల్లప్పుడు ఆరోగ్యంతో ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సమగ్ర సర్వే అంశంలో రాజీవ్‌శర్మ ఎంతో కష్టపడ్డారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రెండున్నరేళ్లలో తెలంగాణకి 12 అవార్డులు వచ్చాయని, నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రంలో రాజీవ్‌శర్మ ఎన్నో సవాళ్లను అధిగమించారని వ్యాఖ్యానించారు.