: రిలయన్స్ జియో ప్రభావం... మలేషియన్ టెలికాం కంపెనీకి వాటా విక్రయించే యోచనలో ఐడియా
రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడంతో మిగతా టెలికాం సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ ప్రభావం ఐడియాపై భారీగానే పడుతోంది. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో ఐడియా వెనుకబడిపోతోందన్న అంచనాల నేపథ్యంలో మలేషియన్ టెలికాం కంపెనీ ఆక్సియాటా ఐడియా సంస్థలోని తన వాటాను విక్రయించాలని భావిస్తోంది. జియో అపరిమిత ఉచిత కాల్స్, తక్కువ ధరకే డేటా సర్వీసు కారణంగా వినియోగదారులు జియో వైపు మళ్లుతుండడంతో ఐడియా మరో మూడేళ్ల పాటు కోలుకోలేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐడియా సంస్థలో తన 20 శాతం వాటాను (2 బిలియన్ల డాలర్ల విలువ) అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై ఐడియా సెల్యులార్ మాతృసంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ తో సంప్రదింపులు జరిపింది. ఆదిత్యా బిర్లా గ్రూపుకి ఐడియాలో 40 శాతం వాటా ఉండడంతో టెలికాం మలేషియా, ఆక్సియాటా వాటాను తిరిగి కొనుగోలు చేసుకోవాలని సదరు సంస్థను ఐడియా కోరింది. అయితే ఇందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ఒప్పుకోకపోవడంతో ఇతర కొనుగోలుదారుల కోసం ఐడియా ఎదురుచూస్తోంది. ఈ అంశంపై బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ వార్తలపై మాత్రం ఐడియా, ఆక్సియాటా సంస్థలు స్పందించకుండా మౌనం పాటిస్తున్నాయి. మరోవైపు టెలికాం సంస్థలపై పెద్దనోట్ల రద్దు నిర్ణయ ప్రభావం కూడా పడింది. మొబైల్ బిల్లులను రద్దయిన 500 నోట్లతో చెల్లించుకోవడానికి వచ్చే నెల 15వ తేదీ వరకు అనుమతి ఉంది. కానీ, నవంబరు 9 నుంచి రూ. 100- 200 మధ్య రీచార్జ్ లు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పడిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఐడియా సంస్థ ఆదాయం 2 శాతం పడిపోయిందని ఈ క్వార్టర్ లో 4-5 శాతం వరకు పోవచ్చని పేర్కొంటున్నారు. అయితే, ఆక్సియాటా వాటా విక్రయిస్తే ఆ సంస్థకు మరిన్ని ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. మలేషియన్ టెలికాం కంపెనీ ఆక్సియాటాకు తన వాటాను విక్రయించాలని ఐడియా భావిస్తోందని వస్తున్న వార్తలతో మార్కెట్ లో ఐడియా కౌంటర్ క్షీణించింది. ప్రస్తుతం దాదాపు 3.28 శాతం నష్టాలతో ఉంది.