: నితీష్ పై సుశీల్ కుమార్ మోదీకి అంత ప్రేమ ఉంటే, ఆయన సోదరినిచ్చి పెళ్లి చేయమనండి: రబ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భవిష్యత్తు గురించి సుశీల్ చాలా బాధ పడుతున్నట్టు ఉన్నారని... అంత ప్రేమ ఉంటే ఆయనను ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చోబెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఆయన సోదరిని ఇచ్చి పెళ్లి చేయవచ్చని... దీంతో, ఆయన ఖ్యాతి కూడా పెరుగుతుందని అన్నారు. ఇటీవల సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, బీజేపీలో నితీష్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉందని... ఆయనకు అదొక స్వర్ణ యుగమని చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల వల్ల నితీష్ చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నితీష్ సమర్థించిన తర్వాత.... సుశీల్ కుమార్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, సుశీల్ కుమార్ వ్యాఖ్యలపై రబ్రీదేవి ప్రతిస్పందనను మీడియా ప్రతినిధులు కోరగా... ఆమె తీవ్ర స్థాయిలో సుశీల్ పై విరుచుకుపడ్డారు. మరోవైపు, రబ్రీదేవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో, ఆమె తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆమె తెలిపారు. సుశీల్ కుమార్ మోదీ తనకు మరిదిలాంటివాడని... అతనికి తాను వదినలాంటిదాన్నని... తాను ఈ మాత్రం పరాచికాలు ఆడతగనా? అంటూ కవరింగ్ ఇచ్చారు.