: నోట్ల రద్దుపై మమతా బెనర్జీ ఆలోచనను విభేదించడానికి కారణం చెప్పిన నితీశ్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు స్వయంగా ఫోన్ చేసిన మమతా బెనర్జీ నోట్ల రద్దుపై తాను చేపట్టిన దీక్ష, నిరసనలకు మద్దతిచ్చి కలసి రావాలని కోరగా, అందుకు నితీశ్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానం మేరకు ఆయనింటికి వెళ్లి, ఆర్జేడీ కార్యకర్తలను కలసి మాట్లాడిన ఆయన మమతా బెనర్జీ ఆలోచనను తాను తిరస్కరించిన కారణాన్ని గురించి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించి, ముందడుగు వేసేందుకు ఓకే చెప్పిన తరువాత, ఎన్ని నిరసనలు తెలిపినా ప్రయోజనం ఉండదని తాను స్పష్టంగా చెప్పినట్టు నితీశ్ వెల్లడించారు. కాగా, డీమానిటైజేషన్ తరువాత పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ, మమతా బెనర్జీ నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు మిగతా విపక్ష పార్టీల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు.