: రాజకీయ వ్యవస్థలో ఇప్పటికే భాగస్వామిని అయ్యాను....పదవీ కాంక్ష మాత్రం లేదు: అభిమానికి అల్లు శిరీష్ సమాధానం
‘గౌరవం’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన మెగా ఫ్యామీలీ యువ కథానాయకుల్లో అల్లు శిరీష్ ఒకడు. ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపట్ల హర్షం వ్యక్తం చేశాడు. దీనిపై తన ట్విట్టర్ లో ‘పెద్ద నోట్ల రద్దు కారణంగా కష్టాలు ఎదురైనా, ప్రజలు దానిని సమర్థిస్తున్నారు. దీని అమలులో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఆపత్కాలంలో మనం ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి సమాధానమిచ్చిన ఓ అభిమాని ‘రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వచ్చారు సర్?’ అని ప్రశ్నించాడు. దీనికి శిరీష్ సమాధానమిస్తూ...‘నేను రాజకీయ వ్యవస్థలో ఇప్పటికే భాగస్వామిని అయ్యాను. ఓటరుగా.. అధికారం, పదవుల వాంఛ నాకు లేదు. కృతజ్ఞతలు’ అని సమాధానమిచ్చాడు.