: లా విద్యార్థినికి టోటల్ కంటే ఎక్కువ మార్కులు!


ఒక విద్యార్థిని న్యాయవిద్య రెండో సంవత్సరంలో టోటల్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సంపాదించింది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ విద్యార్థినిని టాపర్ గా డిక్లేర్ చేసి, వచ్చే నెలలో జరగబోయే వర్శిటీ స్నాతకోత్సవంలో మూడు పతకాలు ఇవ్వాలని కూడా యూనివర్శిటీ అధికారులు నిర్ణయించడం. ఆగ్రాలోని డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ యూనివర్శిటీ లో ఈ పొరపాటు జరిగింది. నీతూ కుమారి అనే విద్యార్థిని ఎల్ఎల్ బీ మూడో సంవత్సరం పరీక్షలు ఇటీవల రాసింది. ఈ పరీక్ష ఫలితాలను ఈ యూనివర్శిటీ ఇటీవల విడుదల చేసింది. ఎల్ ఎల్ బీ మూడేళ్ల మొత్తం మార్కులు 2,800కు 2,173 మార్కులను నీతూకుమారి సాధించింది. అయితే, మూడు సంవత్సరాల మార్కుల లిస్టులను యూనివర్శిటీ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. అసలు విషయం అప్పుడు బయటపడింది. ఎల్ ఎల్ బీ రెండో సంవత్సరంలో మొత్తం 900 మార్కులకు గానూ ఆమెకు 1,055 మార్కులు వచ్చినట్లు తేలింది. జరిగిన పొరపాటు యూనివర్శిటీ అధికారులకు తెలియడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. మార్కుల సవరణ అనంతరం ప్రియాంక శర్మ అనే ఆగ్రా విద్యార్థిని ఎల్ ఎల్ బీ లో యూనివర్శిటీ టాపర్ గా నిలవడంతో, రెండు పతకాలను ఆమె అందుకోనుంది. కాగా, ఈ విషయమై, యూనివర్శిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ, విద్యార్థుల ఫలితాలను నమోదు చేసే ప్రక్రియను ప్రైవేటు ఏజెన్సీకి అప్పజెప్పామని, మార్కులు నమోదు చేసేటప్పుడు ఈ పొరపాటు జరిగిందని అన్నారు.

  • Loading...

More Telugu News