: మావి ఒకే ఆత్మ, రెండు శరీరాలు... భర్త కూడా కాంగ్రెస్ లోకి వస్తాడన్న సంకేతాలిచ్చిన నవజ్యోత్ కౌర్
బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్, తన భర్త సైతం కాంగ్రెస్ లోకి చేరనున్నారన్న సంకేతాలిచ్చారు. చండీగఢ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అమరీందర్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆమె ప్రసంగిస్తూ, "మేము రెండు శరీరాలుగా కనిపిస్తున్నప్పటికీ మా ఆత్మ ఒకటే. ఆత్మ చెప్పినట్టు శరీరాలు వింటాయి" అని అన్నారు. ఆపై అమరీందర్ మాట్లాడుతూ, "శ్రీమతి సిద్ధూ ఇక్కడున్న వేళ, సిద్ధూ మనతో కాకుండా వెళతాడని మీరు అనుకోగలరా?" అని ప్రశ్నించారు. కాగా, దాదాపు పుష్కర కాలం పాటు బీజేపీతో కలసి పనిచేసిన సిద్ధూ సెప్టెంబర్ లో పార్టీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆవాజే-ఏ-పంజాబ్ పార్టీని పెట్టారు కూడా. తరువాత ఆయన భార్య నవజ్యోత్ కౌర్ తన ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఈ జంట కాంగ్రెస్ లో చేరుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.