: నెలలుగా రహస్యంగా దాక్కున్న ఐఎస్ఐఎస్ డిప్యూటీ... ఒక్కసారి బయటకు వస్తే చాలు, పని పూర్తి చేస్తామంటున్న అమెరికా!
గతంలో కొంత కాలం పాటు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రధాన అధికార ప్రతినిధిగా, ఆపై అబూ బకర్ అల్ బగ్దాదీ తరువాత డిప్యూటీగా ఉన్న అబూ ముహమ్మద్ అల్ అద్నానీని మట్టుబెట్టేందుకు అమెరికా సమయం కోసం వేచి చూస్తోంది. గత కొన్ని నెలలుగా, అద్నానీ రహస్య ప్రాంతంలో తలదాచుకుని ఉన్నాడని, ఆయన ఒక్కసారి బయటకు వస్తే, తమ నిఘా కళ్లు పట్టేస్తాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. సెల్ ఫోన్లను ఆయన వాడటం లేదని, పట్టపగలు వీధుల్లోకి రావడం లేదని, సిరియాలో సాధారణ జనసమ్మర్ధం అధికంగా ఉన్న చోట్ల ఉంటూ, చిన్నారులను రక్షణగా వాడుకుంటూ కాలం గడుపుతున్నాడని అమెరికన్ అధికారులు తెలిపారు. పగటిపూట కనీసం పది నిమిషాల పాటు అద్నానీ బయటకు వస్తే చాలు, అతన్ని మట్టుబెట్టే పని ముగుస్తుందని వివరించారు. అమెరికన్లు అద్నానీ కోసం వేచి చూస్తున్నారని, ఇటీవలి దాడుల్లో ఆయన తృటిలో తప్పించుకున్నారని తెలిపారు. కాగా, 39 సంవత్సరాల అద్నానీ కోసం సీఐఏ, పెంటగాన్ సంయుక్తంగా శాటిలైట్లతో ప్రత్యేక నిఘాను ఉంచాయి. కాగా, ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ మరణంతో అద్నానీని చీఫ్ గా ప్రకటించవచ్చని తెలుస్తుండగా, ఆ పని జరిగేలోపే అతన్ని మట్టుబెట్టాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది.