: సుజనా చౌదరి లాంటోడు కేంద్ర మంత్రిగా ఉండొచ్చు... సామాన్యుడు చావాలా?: రఘువీరా
బ్యాంకులకు వందల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన సుజనా చౌదరి లాంటోడు కేంద్ర మంత్రిగా ఉండొచ్చా... సామాన్యులు మాత్రం తమ సొంత డబ్బు కోసం క్యూలైన్లలో నిలబడి చావాలా? అంటూ ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద సంభవిస్తున్న మరణాలకు ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆక్రోశ్ దివస్ లో భాగంగా, విజయవాడలో ఈ రోజు ఆ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి రఘువీరాతో పాటు, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ, నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణమని, ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. మోదీని 21వ శతాబ్దపు తుగ్లక్ గా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.