: వారి ఆందోళన నోట్లను రద్దు చేసినందుకు కాదు... నల్లధనాన్ని రద్దు చేసినందుకే!: కేంద్ర మంత్రి నఖ్వీ
విపక్షాలు చేపట్టిన ఆక్రోశ్ దివస్ పై కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. పెద్ద నోట్లను రద్దు చేసినందుకు వారు భారత్ బంద్ ను చేపట్టలేదని... నల్లధనాన్ని రద్దు చేసినందుకు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వారి వద్ద ఉన్న నల్లధనం పనికిరాకుండా మారడంతోనే, వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని... బ్యాంకులు, ఏటీఎంల వద్ద డబ్బుల కోసం గంటల సేపు క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వామపక్షాలు బంద్ కు పిలుపునివ్వగా, కాంగ్రెస్ పార్టీ ఆక్రోశ్ దివస్ పేరుతో ఆందోళనలు చేపట్టింది.