: సాధారణ పెట్రోల్ తో నడిచే హెలికాఫ్టర్ ధర కోటిన్నర రూపాయలే !
సాధారణ పెట్రోలుతో పనిచేసే, రెండు సీట్లు మాత్రమే ఉండే హెలికాప్టర్ ను గుర్ గ్రామ్ కు చెందిన ఒక ప్రైవేటు విమానయాన సంస్థ తయారు చేస్తోంది. ఈ తరహా హెలికాప్టర్లను దేశంలో తయారు చేయడం ఇదే ప్రథమం అని సంస్థ అధికారి వివేక్ చెప్పారు. సొంత ప్రైవేట్ హెలికాప్టర్ కావాలనుకున్న వారికి తక్కువ ధరకే.. రూ.1.5 కోట్లకే అందజేస్తామని అన్నారు. పోలాండ్ కు చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ హెలికాప్టర్లను తయారు చేస్తున్నామన్నారు. ఆరావళి పర్వత శ్రేణుల్లోని ఒక ఫామ్ హౌస్ లో వీటిని తయారు చేస్తున్నామని, దీని ఇంజన్ 135 హార్స్ పవర్ రోటెక్స్ 92 యూఎల్ ఎస్ అని పేర్కొన్నారు. మన దేశీయులు లేదా విదేశీయుల ఆర్డర్ల మేరకు ఈ హెలికాఫ్టర్లను తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఈ నెల 23-26 తేదీలలో లైవ్ డెమో ఇచ్చామని, జనవరి 12వ తేదీన మరో డెమో ఇవ్వనున్నట్లు వివేక్ పేర్కొన్నారు. అయితే, ఈ హెలికాప్టర్ ల వల్ల పర్యావరణానికి ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. వన్యప్రాణులు, మొక్కలకు ఆవాసమైన ఆరావళి పర్వత శ్రేణులకు సమీపంలోనే మొహమ్మద్ పూర్ ఐఏఎఫ్ డిపో, మనేసర్ ఎన్ఎస్ జీ క్యాంపు, రెండు రక్షణ సంస్థలు ఉన్నాయి. అయితే, సాధారణ పెట్రోలుతో నడిచే హెలికాప్టర్లను తయారు చేస్తున్న ఈ ప్రాజెక్టుపై హర్యానా ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఆరావళి పర్వత శ్రేణుల్లోని ఒక ఫామ్ హౌస్ లోనే హెలికాప్టర్లను తయారు చేస్తున్న సదరు సంస్థ, అక్కడే ఒక రన్ వేను కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ రన్ వే ఏర్పాటు చేసుకునేందుకు వందలాది చెట్లను నరికివేసిందనే ఆరోపణలు ఆ సంస్థపై ఉన్నాయి.