: పాటియాలా నుంచి ఢిల్లీ దాకా తప్పించుకుని రాగలిగాడు... ఆపై బుక్కయ్యాడు!
హర్మీందర్ సింగ్ మింటూ... పాటియాలాలోని నభా జైలుపై పోలీసుల వేషంలో వచ్చిన తొమ్మిది మంది సాయుధులు దాడి చేసి విడిపించుకుని వెళ్లిన ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్. పాటియాలా చుట్టూ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన నిఘాను ఉంచినా, హర్మీందర్ వారి కన్నుగప్పి పట్టణం దాటాడు. 20 గంటల వ్యవధిలో పంజాబ్ రాష్ట్రాన్నే దాటి, ఢిల్లీ పరిధిలోకి వచ్చేశాడు. మింటూ పంజాబ్ ను వీడి ఉండవచ్చన్న అంచనాలతో అటు పంజాబ్, ఇటు ఢిల్లీ పోలీసులు నిఘా పెట్టడంతో మింటూ అడ్డంగా దొరికిపోయాడు. ఓ చెక్ పోస్టు వద్ద వాహనంలో వెళుతున్న మింటూను పోలీసులు సులువుగానే గుర్తించి అదుపులోకి తీసుకున్నారని, మింటూ నుంచి కూడా ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది. కాగా, జైలుపై దాడికి మాస్టర్ మైండ్ గా భావిస్తున్న పరమీందర్ సింగ్ ను యూపీలోని షామ్లీ జిల్లాలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లు తప్పించుకున్న ఘటన వెనుక, జైలు సిబ్బంది తప్పు కూడా ఉందని, వచ్చిన వారి గుర్తింపు పరిశీలనలో విఫలమయ్యారని పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా వ్యాఖ్యానించారు. మిగతావారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.