: కిరాణా వ్యాపారి ఇంట్లో రూ.17 కోట్లు.. స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు
పెద్ద నోట్ల రద్దుతో అక్రమార్కులు బయటకు వస్తున్నారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత భారీ లావాదేవీలపై కన్నేసిన ఐటీ అధికారులు పన్ను ఎగవేతదారుల కొమ్ములు విరుస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ కిరాణాషాపు యజమాని ఇంటిపై దాడిచేసిన అధికారులకు కళ్ల బైర్లు కమ్మాయి. రూ.17 కోట్ల నగదు సహా పెద్ద ఎత్తున బంగారాన్ని అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వేలూరులోని సత్తువాచారి గంగయమ్మ ఆలయం సమీపంలో కేశవ మొదలియార్ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనకు 70కి పైగా ఇళ్లు ఉన్నాయి. ఈనెల 24న కేశవ్ కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. విషయం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందింది. దీంతో ఆదివారం కేశవ ఇళ్లు, దుకాణంపై ఏకకాలంలో దాడులు చేశారు. ఇంట్లోని భూగర్భ గదిలో ఉన్న రూ.17 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు.