: ఇండోర్ జూలో బోనును బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన పెద్దపులి... ఇంకా చిక్కలేదు!
ఇండోర్ లోని కమలా నెహ్రూ జూలాజికల్ గార్డెన్స్ జంతు ప్రదర్శనశాలలోని ఓ పెద్దపులి ఆదివారం సాయంత్రం బోను నుంచి బయటకు వచ్చి, సందర్శకుల్లో భయాందోళనను కలిగించింది. జూలో సందర్శకులు అధిక సంఖ్యలో ఉన్న వేళ, సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అటవీ అధికారుల సమాచారం మేరకు, ఈ పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ సమయంలో జూలో ఉన్న అందరినీ సురక్షితంగా బయటకు చేర్చారు. రాత్రి చీకటి పడటంతో పులిని పట్టుకునే ప్రయత్నాలు ఆపివేసి, తిరిగి నేటి ఉదయం నుంచి అది ఎక్కడుందన్న విషయాన్ని గుర్తించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ పెద్దపులి బోను నుంచి బయటకు వచ్చిన తరవాత, చాలా మంది ప్రజలు చుట్టుపక్కల ఉన్నా, వారిపై దాడి చేయలేదని అధికారులు వివరించారు.