: ప్రారంభమైన ప్రతిపక్షాల 'భారత్ బంద్'.. కనిపించని ప్రభావం.. పట్టించుకోని ప్రజలు!
పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు చేపట్టిన దేశవ్యాప్త బంద్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొంటున్నారు. రోడ్లపై ఆందోళన చేస్తున్నారు. బస్టాండ్ల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు బంద్‌లో పాల్గొనేది లేదని ముందే చెప్పిన కాంగ్రెస్ నేడు 'ఆక్రోస్ దివస్'ను పాటిస్తోంది. వామపక్ష పార్టీలు ఇచ్చిన బంద్‌ను ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. హైదరాబాద్‌లో బంద్ ప్రభావం కాస్తయినా కనిపించడం లేదు. మహాత్మగాంధీ బస్ స్టేషన్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు అన్నీ యథావిధిగా తమ ప్రయాణం ప్రారంభించాయి. తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో అయితే బంద్ ప్రభావం కొంచెం కూడా కనిపించడం లేదు. విజయవాడ బస్‌డిపో నుంచి ఇప్పటికే సర్వీసులు ప్రారంభించాల్సిన 600కుపైగా బస్సులు డిపో నుంచి బయటకు వచ్చాయి. కడప బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న పలు పార్టీల కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ మోహరించారు. నోట్ల రద్దుతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బంద్ అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ఉదయం 9 గంటల నుంచి తమ కార్యాచరణ ప్రారంభిస్తామని వామపక్ష పార్టీలు చెబుతున్నాయి.