: నభా జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు... పంజాబ్ అంతటా హై అలర్ట్
పంజాబ్ లోని పాటియాలాకు సమీపంలో ఉన్న నభా జైలుపై దాడి సంఘటన నేపథ్యంలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నభా జైలు సూపరింటెండెంట్, డీజీని సస్పెండ్ చేస్తున్నట్లు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. ఈరోజు ఉదయం నభా జైలుపై సాయుధ దుండగులు దాడి చేసి ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ కు చెందిన ఐదుగురు మిలిటెంట్లను విడిపించుకుపోయారు. దీంతో, పంజాబ్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. పారిపోయిన మిలిటెంట్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, జైలుపై మెరుపుదాడి ఘటనపై నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రహోం శాఖ ఆదేశించింది.