: నన్నపనేనికీ తప్పని కరెన్సీ కష్టాలు.. నోట్ల రద్దుతో నిశ్చితార్థ వేదిక మార్పు
సామాన్యులకే కాదు.. నోట్ల రద్దు సెగ రాజకీయ నేతలకూ తగులుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటుండగా మరికొందరు ఖర్చులు తగ్గించుకుంటూ చేతిలో ఉన్న సొమ్ముతోనే సరిపెట్టుకుంటున్నారు. తాజాగా నోట్ల రద్దు దెబ్బకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కుటుంబంలో జరగాల్సిన ఓ శుభకార్యం వేదిక మారిపోయింది. రాజకుమారి మరిది కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకను డిసెంబరులో నిర్వహించాలని 20 రోజుల క్రితమే నిర్ణయించారు. ఇందుకోసం పెద్ద ఫంక్షన్ హాల్‌ను బుక్ చేశారు. అయితే 8వ తేదీన ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నాటి నుంచి రాజకుమారి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. దీంతో నిశ్చితార్థం వేదిక మారిపోయింది. ప్రస్తుతం డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో నిశ్చితార్థ వేడుకను ఫంక్షన్‌హాల్ నుంచి తెనాలి ఐతానగర్‌లోని సాయిబాబా ఆలయానికి మార్చారు. అంతేకాదు, కుటుంబ సభ్యులతోనే వేడుకను సరిపెట్టుకుంటున్నట్టు రాజకుమారి తెలిపారు. పెళ్లిని కూడా ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు ఆమె పేర్కొన్నారు.