: మోదీని ఆకాశానికి ఎత్తేసిన సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అమర్ సింగ్
భారత ప్రదాని నరేంద్ర మోదీపై సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అమర్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. నల్లధనానికి చెక్ పెట్టే దిశగా, పెద్ద నోట్లను రద్దు చేయాలని మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదని ఆయన అభివర్ణించారు. క్షేత్ర స్థాయిలో సరైన అరేంజ్ మెంట్లు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ... హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడంతో, నల్లధనం కలిగిన వారు వాటిని మార్చుకోలేకపోయారని అన్నారు. మోదీ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారని... అవినీతిని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని పనిచేస్తున్నారన్న భావన ప్రజల్లో నెలకొందని చెప్పారు. నల్లకుబేరులపై మోదీ ఉక్కుపాదం మోపుతున్నారని ...తన సొంత పార్టీ బీజేపీ నేతలైనా సరే, మోదీ కరుణించడం లేదని పొగిడారు. మోదీ చర్యలతో నల్లకుబేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అమర్ సింగ్ అన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో ధనిక, పేదల మధ్య ఉన్న అంతరం కొంత మేర తగ్గిందని అమర్ సింగ్ తెలిపారు. ఇప్పటి నుంచి పన్ను ఎగవేతల గురించి ఆలోచించకుండా... అందరూ పన్నులు కట్టే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. తాను బీజేపీ ప్రతినిధిని కాదని... సమాజ్ వాదీ పార్టీ ఎంపీనని... నోట్ల రద్దు వ్యవహారంపై తమ పార్టీ ఆలోచన ఏదైనప్పటికీ... తాను మాత్రం తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపారు. అయితే, నోట్లను రద్దు చేయడం, కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకురావడంలో కొన్ని వైఫల్యాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. దీని వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అయితే, కొద్ది రోజుల తర్వాత సమస్యలన్నీ తీరిపోతాయని... జనాలంతా మోదీకి మద్దతుగా నిలుస్తారని అమర్ చెప్పారు.