: ఇది సినిమా సీన్ కాదు.. కాసేపట్లో పెళ్లి.. రంగ ప్రవేశం చేసిన ప్రియుడు.. ఆగిన వివాహం
జగిత్యాలలోని మోరపల్లిలో నిన్న ఓ పెళ్లి వేడుకలో అలజడి చెలరేగింది. వరుడు తాళి కట్టడానికి కొద్దిసేపటి ముందు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వధూవరుల కుటుంబాలు ఎంతో సంతోషంలో మునిగిపోయి ఉన్న సమయంలో ఒక్కసారిగా ఓ యువకుడు దూసుకువచ్చాడు. తాను గోదావరిఖనికి చెందిన యూసఫ్ నని చెప్పాడు. తాను పెళ్లి పీటలపై కూర్చున్న అమ్మాయిని ఎప్పటి నుంచో గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. తాను చెబుతున్న అంశాలకు సాక్ష్యంగా తన సెల్‌ఫోన్‌లో గతంతో ఆ యువతితో గడుపుతుండగా తీసుకున్న ఫొటోలను వరుడికి చూపించాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు యూసఫ్‌ను పట్టుకొని, చెట్టుకు కట్టేసి మరీ చావబాదారు. ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యూసఫ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, ఆ యువకుడు చెప్పిన అంశాలు నిజమేనని పెళ్లి కూతురు కూడా చెప్పింది. దీంతో ఇరుకుటుంబాలు కలిసి మాట్లాడుకొని ఇష్టపూర్వకంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో పెళ్లికి గిఫ్టులు పట్టుకొని వచ్చిన బంధుమిత్రులంతా మెల్లగా ఇంటికి వెళ్లిపోయారు. పెళ్లి వేదిక, పెళ్లి సామగ్రిని తొలగించేశారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న యూసఫ్ డాక్టర్లు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై వధూవరుల కుటుంబాలకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీస్ స్టేషనులో కేసు నమోదు కాలేదు.