: జోరుమీదున్న టీమిండియా.. మార్పులతో సిద్ధమైన ఇంగ్లండ్.. నేటి నుంచి మూడో టెస్ట్
మరికొద్దిసేపట్లో మొహాలీలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ జరగనుంది. విశాఖపట్నంలో ఘన విజయం సాధించిన టీమిండియా అదే ఊపుతో మొహాలీలోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 22 ఏళ్లుగా ఓటమి ఎరుగని మొహాలీలో అదే రికార్డు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు విశాఖలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 1-1తో సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. భారత జట్టులో కెప్టెన్ కోహ్లీతోపాటు చటేశ్వర్ పుజారా మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో స్పిన్నర్లు, పేసర్లు తమ సత్తా చాటుతుండడంతో టీమిండియా ప్రత్యర్థి జట్టుకంటే మెరుగ్గా ఉంది. మరోవైపు రాజ్‌కోట్ టెస్టును డ్రా చేసుకుని, విశాఖలో ఘోరంగా ఓటమిపాలైన ఇంగ్లిష్ జట్టు మొహాలీలో గెలిచి ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అయితే ఆటగాళ్ల ఫామ్, గాయాలు ఆ జట్టుకు సమస్యలుగా మారాయి. మొహాలీ పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని అదనపు పేసర్లపై ఇంగ్లండ్ మొగ్గుచూపే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే స్టీవెన్ ఫిన్, జేక్ బాల్‌లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. టీమిండియా మాత్రం ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది. చివరి మూడు టెస్టులకు జట్టులో చోటు దక్కించుకున్న స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.