: దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై న‌గ‌రంగా హైద‌రాబాద్‌.. న‌గ‌రంలో 150 హాట్‌స్పాట్ల ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్ ప్రణాళిక‌లు


భాగ్య‌న‌గ‌రం ఇక దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై మ‌హాన‌గ‌రంగా రూపుదిద్దుకోనుంది. హైద‌రాబాద్ వ్యాప్తంగా వైఫై సేవ‌ల విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ ఎల్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. హాట్‌స్పాట్లు ఏర్పాటు చేసి ఫ్రీ వైఫై సేవ‌లు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. న‌గ‌రంలో 150 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం క్వాడ్జ‌న్ సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్ప‌టికే 49 హాట్‌స్పాట్లు ఏర్పాటు చేసి వైఫై సేవ‌లు అందిస్తోంది. దీనిని మ‌రింత విస్త‌రించి స్మాల్‌, మీడియం, లార్జ్ హాట్‌స్పాట్లు ఏర్పాటు చేసి న‌గ‌ర‌మంతా ఉచిత వైఫై సేవ‌లు అందించ‌నుంది. ఒక్కో హాట్‌స్పాట్‌కు ఐదు వైఫై ట‌వ‌ర్లు, ఒక్కో ట‌వ‌ర్ ఐదు నుంచి ప‌ది కిలోమీట‌ర్ల ప‌రిధిలో సేవ‌లు అందించేలా తీర్చిదిద్ద‌నున్నారు. హాట్‌స్పాట్స్ వినియోగ‌దారులు 2 నుంచి 10 ఎంబీల వ‌ర‌కు డేటాను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇక బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు వైఫై మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రంగా మార‌నుంది. బీఎస్ఎన్ఎల్ 3జీ వినియోగదారులు వైఫై జోన్‌లో ప్ర‌వేశించ‌గానే మొబైల్ డేటా దానంత‌ట అదే ఆగిపోయి వైఫై యాక్టివేట్ అవుతుంది. మొబైల్ డేటా ప్లాన్ ప్ర‌కారం డేటాను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల వినియోగదారులు తొలి 15 నిమిషాల పాటు వైఫై సేవ‌లను ఉచితంగా వినియోగించుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత వోచ‌ర్లు, క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ను ఉప‌యోగించి సేవ‌లు పొంద‌వ‌చ్చు. న‌గ‌రంలో ఉచిత వైఫై సేవ‌లు వ‌చ్చే ఏడాది మార్చి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న‌ట్టు బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిప‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ రాంచంద్ తెలిపారు.

  • Loading...

More Telugu News