: త్వరలో తిరుమలకు కేసీఆర్.. శ్రీవారికి తెలంగాణ స్వర్ణకానుకలు సమర్పించనున్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు సహా మంత్రివర్గంతో కలిసి త్వరలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే శ్రీవారికి స్వర్ణాభరణాలు చేయిస్తానని కేసీఆర్ వేంకటేశ్వరస్వామికి మొక్కుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి రాష్ట్రం సిద్ధించింది. దీంతో అనుకున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లు జమచేసింది. ఈ నిధులతో శ్రీవారికి కమలం నమూనాతో సాలిగ్రామ హారం, ఐదు పేటల కంఠె తయారు చేయించాలని దేవస్థానానికి సూచించింది. ఈ మేరకు టీటీడీ టెండర్లు ఆహ్వానించి కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ జ్యూయలర్స్‌ను ఎంపిక చేసి స్వర్ణాభరణాలు తయారుచేయించింది. 14.200 కిలోల సాలిగ్రామ హారానికి రూ.3,70,76,200; 4.650 కిలోల కంఠెకు రూ.1,21,41,150 ఖర్చు అయినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. వీటిని తయారుచేసి ఇప్పటికి పదినెలలు గడిచినా ఇప్పటి వరకు వాటిని స్వామి వారికి సమర్పించలేదు. దీంతో ఈ ఆభరణాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మంత్రివర్గం, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక రైలులో తిరుపతి యాత్రకు బయలుదేరాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.