: లెక్కలు చూపని డిపాజిట్టుపై కొరడా.. 50 శాతం వరకు పన్ను.. ప్రభుత్వం గుర్తిస్తే కనుక 90 శాతం పన్ను: కేంద్రం కీలక నిర్ణయాలు


పెద్ద నోట్ల రద్దు తరువాత దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో జరుగుతున్న లావాదేవీలపై కేంద్ర ఆర్థిక శాఖ నిఘా ఉంచింది. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ రోజు మ‌రిన్ని కీలక నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు కూడా త‌మ ఆదాయ వివ‌రాల‌ను, ర‌ద్ద‌యిన నోట్ల డిపాజిట్ల వివ‌రాలను తెలప‌ని వారికి మ‌రో అవ‌కాశం ఇస్తున్న‌ట్లు పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం, వ‌చ్చేనెల 30 లోగా చేసే డిపాజిట్లలో లెక్కలు వెల్లడించని మొత్తంపై కనిష్టంగా 50 శాతం టాక్స్ విధిస్తారు. అంటే, ఖాతాదారు చేసిన డిపాజిట్టులో సగం పన్నుగా వెళ్లిపోతుందన్న మాట. ఇక మిగిలిన 50 శాతం మొత్తంలో 25 శాతాన్ని నాలుగేళ్ల పాటు బ్యాంకు నుంచి ఉపసంహరించుకోకుండా లాక్ చేస్తారు. ఇక లెక్కలు వెల్లడించని డిపాజిట్టు మొత్తాన్ని ఖాతాదారు తనకు తానుగా వెల్లడించని పక్షంలో, ఐటీ శాఖ గుర్తిస్తే కనుక మొత్తం డిపాజిట్టుపై 90 శాతం వరకు టాక్స్, అపరాధ రుసుము విధించే ఆస్కారం వుంది. ఈ విధంగా ఆదాయపన్ను చట్టాన్ని సవరించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ అంశాల‌కు సంబంధించి ఐటీ చట్టానికి ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే సవరణ బిల్లు తీసుకురావాల‌ని ప్రభుత్వం యోచిస్తోంది.

  • Loading...

More Telugu News